మానవులు
సూటిగా సరళంగా ఉన్న సత్యాన్ని గ్రహించలేరు. తమ వద్దనున్న దాని గురించి పట్టించుకోరు.
లేనిదాని కోసం ప్రాకులాడుతారు. ఈ సత్యం వారి దైనందిన జీవితానుభవం. ఆత్మను గూర్చిన
సత్యం కూడా ఇదే. ఆత్మను ఎరుగనివారు, వివిధ సందర్భాలలో తమకు తెలియకుండానే ఆత్మను
మిళితం చేసే మాటలు మాట్లడనివారు లేరు. ఇట్టివారు తమలోనే ఉన్న నిత్యమైన, సత్యమైన,
చైతన్యమైన, ఆత్మను తెలుసుకోవటానికి మాత్రం ప్రయత్నించరు. తమ అధీనంలోలేని, ఉన్నదో
లేదో తెలీని అతీతమైన, స్వర్గం, నరకం, పునర్జన్మ వంటివన్నీ తెలుసుకోవాలని అతృత
చెందుతుంటారు. అంటే సరళమైన సత్యాన్ని కాదని, ఎదో మర్మంగా ఉండేదంటేనే వాళ్లకు
ప్రేమ. వారి అభీష్టం మేరకే మతాలు కూడా వంత పాడుతున్నా, చివరకు ఆత్మ విచారానికే అవి
మార్గాన్ని చూపుతున్నాయి.
అలాగే
మనిషి తన నిజమైన మూలానికి తిరుగు ముఖంపట్టి , నడిచేటట్టు చేసేందుకే శాస్త్రాలన్నీ
ఉద్దేశిoబడ్డాయి . అతడు కొత్తగా ఏదీ పొందనక్కర్లేదు. అనుచిత భావాలనూ, పనికి మాలిన
సంస్కారరాశిని పరిత్యజించవలసి ఉంది. ఇలా చెయ్యకుండా ఎదో వింతైన, నిగూడమైన దానిని
చేజిక్కించుకోవటానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. అదే తప్పు. మినహాయింపన్నదే లేకుండా
శాస్త్రాలన్నీ మోక్షం కోసం, మనస్సును లోబరచుకోవలసి ఉంటుందని ఉద్బోధిస్తున్నాయి.
అంటే అంతిమ లక్ష్యం మనో నిగ్రహమే అని ఒకసారి తెలిసిన తర్వాత అంతూ పొంతూ లేకుండా
శాస్త్రాలను అధ్యయనం చేయటం నిరర్ధకరం. పంచకోశాలలోపల ఉన్న ఆత్మ అనే ‘నేను’ ను
కనుగొనటానికి, వాటి వెలుపల ఉన్న శాస్త్రాలను చదవటం వ్యర్థం. నీవు ఎంత మేర
తిరిగిననూ, తిరిగి తిరిగి, ఆత్మ వద్దకే రావలసియుంది. అలాంటప్పుడు ఇప్పటికిప్పుడే
ఆత్మనిష్ఠలో ఎందుకు స్థిరంగా ఉండకూడదు. దీనికి కావలసింది ‘నేను ఎవరు’ అని నిన్ను
నువ్వు ప్రశ్నించుకోవటమే. శాస్త్రాలను అధ్యయనం చేస్తూ పోతే ఈ విధమైన ఆత్మవిచారం
ఎలా సాధ్య పడుతుంది? ఆత్మను జ్ఞానచక్షువుతో దర్సిoచాల్సి ఉంది. మనస్సును సర్వదా అంతర్ముఖంగా ఉంచుతూ ,
ఆత్మలో లీనమై ఉండటమే ఆత్మ విచారం.
ఆత్మవిచారం
సర్వసంగపరిత్యాగికి మాత్రమే సాధ్యమనుకోవటం
తప్పు. ఆధ్యాత్మిక సాధన అంతరంగానికి చెంది
నది. అది మనస్సులోనే జరగాలి. గృహస్తుడవని నీవెందుకనుకుoటావు. నీవు సన్యాసిగా
మారినా అదే తలంపు నిన్ను పట్టి పీడిస్తుంది. నీవు గృహస్తుడవై ఉండి, గృహస్తుడవని అనుకోకుంటే
అది సన్యాసమే. కాని సన్యాసి తాను
సన్యాసినని అనుకుంటున్నంత కాలం అతడు సన్యాసి కాలేడు. నీవు గృహస్థాశ్రమంలో ఉన్నా,
లేక దాన్ని విడిచి అడవులకు వెళ్ళినా, నీ మనస్సు నిన్ను వేధిస్తూ ఉంటుంది. ఈ తలoపులకు
మూలం అహంభావమే. అదే దేహాన్ని, ప్రపంచాన్ని సృష్టించి, నీవు గృహస్తుడవని అనుకునేటట్లు
చేస్తుంది. నీవు సన్యసిస్తే, సంసారానికి బదులు సన్యాసానికి సంబంధించిన తలoపులూ,
ఇంటికి బదులు అడవికి చెందిన తలoపులూ తెచ్చి పెడుతుంది. అంటే మానసికమైన ఆటంకం నీకు ఎప్పుడూ
ఉండనే ఉంటుంది. అంటే ఉన్న ఏకైక ఆటంకం మనస్సు. అది అతిక్రమించబడాలి. అది అడవిలో సాధ్యమని
నీవు అనుకుంటే, అది ఇంట్లో మాత్రం ఎందుకు సాధ్యపడదు. నీవు ఇక్కడ ఉన్నా, అడవికి
పోయినా ఒకటే. మనస్సు కదా నీతో ఉండేది. నీ సంసారములోనే జ్ఞానం సంపాదించ గలవు. దానికి
సన్యాసం ఎందుకు. సంసారం బాధే కాని, దాంట్లో నుంచి జ్ఞాని కావడం ఎక్కువ సులభం.
ఆత్మ
నిష్టుడై ఉంటే, వ్యావహారిక జీవితంలోని కర్తవ్యాలు సవ్యంగా నిర్వహిoచలేమనుకోవటం
తప్పు. ఒకే నటుడు, తను ధరించే పాత్రకు తగిన ఆహార్యం ధరించి, నటనలో లీనమవుతాడు.
కాని ఆ పాత్ర తాను కాదని, నిజ జీవితంలో తాను వేరే వ్యక్తినని అతనికి తెలుసు. నీవు
ఆత్మవని, శరీరానివి కావని, ఒకసారి తెలుసుకున్న పిదప, శరీరం ఏమి చేస్తున్నా, నీ
ఆత్మనిష్ఠ చెదరవలసిన పని లేదు. అంటే తన దేహం తాలూకు ఎట్టి కర్తవ్యాలనైనా సముచితంగా, సమర్థవంతంగా
నిర్వహించడాన్ని నీ ఆత్మనిష్ఠ ఎన్నడూ ఆటoక పరచదు .
మనిషి
వివాహితుడైనా, అవివాహితుడైనా, ఆత్మానుభూతిని పొందగలడు. ఎందుకంటే ఆత్మ ఎప్పుడూ
ఉన్నదే. అది నిత్య సిద్ధమైనది. కొత్తగా సంపాదిoచుకోవలసినది కాదు. కొత్తగా సంపాదిoచు
కోవలసిన వస్తువు అయితే అటువంటిది అన్వేషిoచటానికి తగదు. అంటే ఏది సహజసిద్ధమైనది
కాదో అది శాశ్వతమైనదీ కాదు. అంటే ఆత్మ (ఉండేది,ఉంటున్నది,ఉండబోయేది )
ఇప్పటికిప్పుడు ఉన్నదీ, ఉన్నది అది
మాత్రమే , అనీ తెలుసుకోవాలి.
నేను
అను తలంపు పుట్టడమే ఒక వ్యక్తి పుట్టుక. ఈ తలoపు పుట్టినప్పుడు ‘శరీరమే నేనను’ తాదాత్మ్య భావం
బయలు దేరుతుంది. దీనివలన ఇతరులనూ శరీరాలుగానే భావిస్తావు. ఈ శరీరం పుట్టి పెరిగి
నశిస్తుంది. ఈ శరీర తలంపు ఉన్నంతవరకు దు:ఖo ఉంటూనే ఉంటుంది. ఈ రూపాన్ని
అతిక్రమించి అసలైన ఆత్మను తెలుసుకున్నప్పుడు, నీవు నిత్యమనీ, ఇతరులూ నిత్యమనీ
గ్రహిస్తావు. అప్పుడిక జననమూ లేదు మరణమూ లేదు. ఈ రెండూ కలిగేది శరీరానికి మాత్రమే.
ఇది అహంభావం యొక్క సృష్టి. దేహం లేకుండా అహంభావం గుర్తించబడదు. ఇది దేహంతో అనన్యభావాన్ని
పొంది ఉంటుంది.
సుషుప్తిలో
గుర్తింపబడని, శరీరం, ప్రపంచం, జనన మరణాలు, దుఃఖం మొదలైనవి జాగ్రదావస్థలో ఎందుకు వస్తున్నాయి. ఆత్మ రెండు అవస్థలలోను
ఉంది కదా. అంటే మొదటి అవస్థలో లేనిది , రెండవ అవస్థలో ఉన్నది ‘మనస్సు’ ‘ఆలోచనలు’
‘అహంభావం’. కాబట్టి, నీవు అంతర్ముఖుడవైతేనే
నీవు ఈ జనన మరణ దుఃఖాల నుండి విముక్తుడవవుతావు.