Tuesday, 9 August 2016

నిత్యసత్యం - 05


ఆత్మ విచారానికి మార్గాలు రెండు.
1.     నేను ఎవరు – సాధన
2.     శరణాగతి
1.     నేను ఎవడను :
సప్తధాతువులచే ఏర్పడిన ఈ స్థూలదేహము గాని
పంచ జ్ఞానేంద్రియ, కర్మేంద్రియములు గాని
ప్రాణాది వాయు సంచకములు గాని, మనస్సుగాని
ఇవేవీ నేను కాదు. ఇవన్నీ జడములే.
అంటే మనము వేటిని  చూసి ‘నేను’ అని భ్రమ పడుతున్నామో అవి నేను కాదు. మరి ‘నేను ఎవడను?’.  
ఇవన్నియు కాని, ఏకసద్రూపమైన జ్ఞానము, చైతన్యమూ అయినది, ప్రత్యేకమైనది అయిన, ‘ఆత్మ’ యే నేను.
దీని రూపమేదియని తెలిసికొనినపుడు , తానే  గొప్పదియు, జ్ఞానమే స్వరూపము కలదియు, తుది లేనిదియు, ఆది కానరానిదియు , అఖండపరిపూర్ణంబైన సుఖస్వరూపమని తెలియును.
‘అనంతాద్యఖండచిత్ సుఖంబే తాను’.  ఆత్మైక్యానుభూతి వలననే ఆత్మనిష్ఠ కలుగుచున్నది. అట్టి తన్మయనిష్ఠలో , తాను రెండుగా భాసిoచుట ఎట్లు సాధ్యం? నిష్టానుభూతిలో జీవేశ్వర భేదము పూర్తిగా పోవును. జీవేశ్వరులిద్దరును  సత్స్వరూపులై ఉండుటచే ఏకవస్తువై ఉన్నారు.
ఎక్కడైతే ‘నేను’ అను జీవ అహంభావం నశిస్తుందో , అక్కడ అఖండ పరిపూర్ణంబగు పరమాత్మ స్వయముగా‘నేను-నేను’ అంటూ వెలుగుతూ ఉంటుంది. అంటే ‘ఆహమిదం – ఆహమిదం’ అను చిన్న జీవభావము పోయి , ‘అహం-అహం’ అను, అఖండ – ఆత్మభావము ప్రకాశిస్తుంది .మనస్సు అనే వస్తువు ప్రత్యేకంగా లేదు. అది ఆత్మ నుంచి వచ్చిన ఒక ‘కాంతి’. అది ఆత్మ స్వరూపము నందున్న ఒక అతిశయ శక్తి. ఈ మనస్సునుoడియే అన్ని తలంపులు  వస్తున్నాయి. కనుక తలంపులే మనస్సు యొక్క స్వభావము. వీటిని త్రోసివేసినపుడు ‘ఆత్మ’ స్వరూపం దర్శ  నమిస్తుంది.

మనస్సు లెక్కలేనన్ని తలంపులతో విరియుటచే ఒక్కొక్క తలంపు అతి బలహీనంగా ఉంటుంది. ఈ తలంపులను పూర్తిగా కొనసాగించక, ఒక్కొక్క తలంపు కల్గిన వెంటనే ‘ఈ తలంపు ఎవరికి కల్గినది’ అని ప్రశ్నిoచుకో. ‘నాకు’ అన్న జవాబు వస్తుంది. అప్పుడు ‘నేను ఎవడను’ అని ప్రశ్నిoచుకుంటూ , ఒక్కొక్క తలంపుని నాశనం చేస్తూ పోయిన యెడల, అంతర్ముఖుడవై ఆత్మ లోనికి ప్రవేశిస్తున్నావని కనుగొంటావు. అంటే తలంపులు తొలగి, మనస్సు తాను పుట్టిన చోటికి మరలి వస్తుంది. ఈ అభ్యాసము చేయగా చేయగా, మనస్సునకు తన జన్మస్థానమందు నిలిచి యుండు శక్తి అధికమవుతూ వస్తుంది. అప్పుడు ఇతర తలంపులను అడ్డగించ ప్రయత్నమక్కర్లేదు. అవి వాటంతటవే అంతర్ధానమమవుతాయి.
కూర వండేటప్పుడు మూత పెట్టాలి. అప్పుడే ఆవిరి అణుగుతుంది. కూర పక్వమై రుచిని పడి, తినడానికి యోగ్యమవుతుంది. అలాగే మన మనస్సుకి మూత వేస్తే వృత్తులు అణుగుతాయి. మనిషి జ్ఞానియై, ఈశ్వరుడితో లయిoచటానికి సిద్ధమవుతాడు.  
స్వయంకృషి వలననే అంతరాత్మను చేరగలము. ఒక్కసారి చేరిన పిదప నీవేది చేసినను, ఆత్మ చేతనే. నీకందులో నిమిత్తము లేదు. ఆత్మాన్వేషణ తగినంత అభివృద్ధి చెంది పరిపక్వ దశకు చేరినపుడు, ఆ ఆత్మయే నీకు చేయూతనిచ్చి  లోనికి తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ‘నిన్ను నీవు తెలుసుకోవలెనను బుద్ది’ కలగటమే, ఈశ్వర అనుగ్రహమునకు గుర్తు. నీలో ప్రకాశించుచున్న అంతరాత్మ, నిన్ను లోపలికి రమ్మని పిలుస్తున్నది. కేవలం నీవు వెలుపలి నుండి లోపలికి పోవుటకు ప్రయత్నించవలెను. అట్టి ఆత్మను కనుగొనిన యెడల, ఈ ప్రపంచమునకు అంతయూ ఆత్మయై వెలుగు ఏకైక వస్తువును కనుగొనిన వాడవవుతావు.
ఆత్మ అనగా అహంభావము, జీవుడు, దేహము కాదు.

పరమాత్మ అనగా అశాశ్వత మగు జీవునకంటే పరమైన పరాపర వస్తు తత్వము.

No comments:

Post a Comment