Tuesday, 9 August 2016

నిత్యసత్యం - 09


భగవంతుడు.
ఈ విశ్వమంతా ఆత్మ యొక్క శక్తి వల్లనే నిలబడుతోంది. (దీనినే ఆస్తికులు ‘భగవంతుడు’అంటారు )
భగవంతుడనేది ఆత్మకు పర్యాయపదం. భగవంతుడు సాకారుడు కాదు. విశ్వంభరుడైన నిరాకారుడు. ఆయనకు గల శక్తికి, విశ్వం ఒక బాహ్య రూపం మాత్రమే. ఆయనని విశ్వం నుండి విడదీయలేము. కాని విశ్వం యొక్క ఉనికి గాని, లేమి గాని ఆయనని ప్రభావితం చేయదు. ఆత్మ అనేది విశుద్ధ స్థితి. నేనున్నాననే ఎరుక.
అయితే, ఆ ఎరుకలో ‘నేనిది’ ‘నేనది’ అన్నభావముండదు . ఆత్మలో కర్తగాని, కర్మగాని, ఉండవు. అది కేవలం ఎరుకే. ఈ ఎరుక చైతన్యమవటం వల్ల ,దీనిని ప్రత్యక్షంగా అనుభవించటమే, నిరవధిక సంతోషం మరియు ఆనందం. ఉనికి , చైతన్యం, ఆనందం, వేరువేరుగా కాక, అవిభాజ్యంగా, ఏకలక్షణంగా ఆత్మకి అనుభవ సిద్ధమౌతాయి.
ఆత్మ జ్ఞానంలో ఏ మాత్రమూ అవిద్య లేదు. స్వచ్చంగా ప్రకాశిస్తూ  దుఃఖంగాని, దేహంగాని లేకుండా, ప్రపంచపు లేమి, ఉనికి ఎరిగినప్పుడు కూడా ఉండే సత్యమే నీ నిజ స్వరూపం. చిదానందాన్ని విరజిమ్ముతూ, లోపలా బయటా సమానంగా ప్రకాశించే ఎరుకే, ఆనందమయమైన మౌలిక సత్యం. మౌనం దాని స్వరూపం . అసలైన , అవరోధం లేని జ్ఞానమదే. జ్ఞానమే వైరాగ్యం, జ్ఞానమే స్వచ్చత, జ్ఞానమే భగవంతుని పొందు. ఆత్మని విస్మరింపని జ్ఞానమే అమరత్వం.
ఆత్మ ఎప్పుడూ ఉంటూనే ఉంది. ప్రతి వారికీ ఆత్మని తెలుసుకోవాలనీ ఉంటుంది. తన గురించి తాను తెలుసుకోవటానికి ఎవరి సహాయం కావాలి. అంతర్ముఖమైన మనస్సు ఆత్మ. అదే బహిర్గతమైతే అహం, ప్రపంచం అవుతుంది . మనస్సు లేకుండా ఆత్మ ఉంటుంది. కాని ఆత్మ లేకుండా మనస్సు ఉండదు. అంటే మనస్సుకు స్వయం ప్రతిపత్తి లేదు.
తాను ఒక వ్యక్తిననీ , ఒక దేహాన్ని ఆక్రమిoచుకున్నానని, ఊహించటం మానివేస్తే అన్ని తప్పు అభిప్రాయాలు పోయి, ఆత్మజ్ఞానం శాశ్వతంగా కలుగుతుంది. నువ్వే ఆత్మవి. నువ్వు ఎప్పుడూ అదే. అసలు సంగతేమిటంటే నీ ఆనందమయస్థితి గురించి నీకు తెలియదు. ఈ ఆనందనిలయమైన ఆత్మను నీ నుంచి అజ్ఞానం ఒక తెరవలే కప్పివేస్తుంది. నీవు చేయవలసిన కృషి అంతా ఆ తెరను తొలగించటానికే. ఎప్పుడూ ఉండేది చైతన్యం. నిద్రలో శరీరమున్నట్లే, తెలియదు. మేల్కొని ఉన్నప్పుడు మాత్రమే శరీర స్పృహ వస్తుంది. దాని వెనుక దాని వాసనలూనూ. ఈ శరీరమే నేను అనుభావం పోవాలి. అదే సాక్షాత్కారం.
అంతటా వ్యాపించియున్న ఆత్మని తెలుసుకోలేమంటే ఎలా. ఆత్మస్వరూపం తెలియదనటం ‘నేనెవరో నాకు తెలియదు’ అనటం వంటిది. ఆత్మ స్వరూపమే నీవు. నీవే ఆత్మ. భాగవత్సాక్షాత్కారమన్నా , ఆత్మసాక్షాత్కారమన్నా ఒక్కటే. ఈ ఆత్మని ఎలా తెలుసుకోవాలి అని అడగటo ఎలా ఉందంటే “రామణాశ్రమంలో ఉంటూ, రమణాశ్రమం చేరుకోవటానికి మార్గాలేమిటి? వాటిలో అన్నిటి కన్నా మంచిదేమిటి? “ అన్నట్లుంది. నీవు చేయవలసిందల్లా, ఈ శరీరమే నేను అనే భావాన్ని, ఇతర బాహ్యవిషయాలను, ఆలోచనలను విడనాడటమే . ఈ ప్రపంచాన్ని మిగిలిన వాటిని నీవు గ్రహించటానికి మూలకారణం అహంకారం . దాని మూలం కనుక్కొంటే అదిలేదని  నువ్వు చూసే ఈ సృష్టి కూడా లేదని తెలుస్తుంది.   
స్వప్న, సుషుప్తి, జాగ్రదావస్థలలో నువ్వు ఆత్మగా వున్నావనేది స్పష్టం.
ఈ మూడు అవస్థలూ వస్తుంటాయి, పోతుంటాయి. కాని నువ్వు మాత్రం ఎప్పుడూ ఉంటావు.
ఇదొక సినిమా లాంటిది. తెర ఎప్పుడూ ఉంటుంది. తెరమీద బొమ్మలు, పెద్ద పెద్ద కెరటాలతో మహా సముద్రం, మంటలు, ఇలాంటివన్నీ కనబడతాయి, పోతాయి. కాని తెరని ఏదీ ఏమీ చేయలేదు. అందువల్ల ఏ అవస్థలో ఉన్నా వాటి ప్రభావం నీ మీద ఉండదు. నువ్వు ఆత్మగానే ఉంటావు. దానికి ఒకే ఒక అవస్థ ఉంటుంది. అదే చైతన్యం లేదా ఉనికి.  అదే సత్యం.
                                                           








No comments:

Post a Comment