Tuesday, 9 August 2016

నిత్యసత్యం - 06

1.       శరణాగతి : శరణాగతి అంటే తనకు తాను, తన సర్వస్వం ఆ కరుణామయుడికి అర్పించడం. ఇక అతనికి మిగిలింది ఏమిటి? ఏమీ లేదు. తనూ లేడు, తనవీలేవు .పుట్టి గిట్టే శరీరం భగవంతుడి పరమైంది. ఇక దాని గురించి ఆలోచించవలసిన పనిలేదు. చావుపుట్టుకలు భయభ్రాంతులను కలుగజేయలేవు. భయానికి కారణం శరీరం. అది తనది కాదు. ఇక దేనికి భయపడాలి?. ఆ విధంగా ఆత్మ తెలియబడి ప్రశాంతత చేకూరుతుంది. ఇప్పుడది అనుభవ పూర్వకమైంది. సుఖదుఃఖాల నుండి విముక్తి కలిగించేది. శరణాగతి అంటేనే ప్రశాంతత. ఇదే ఆ సంబంధం.
నీవాయనకు శరణాగతుడవై ఉంటూ, ఆయన కన్పించినా, కన్పించకపోయినా, ఆయన అభీష్టాన్ని స్వీకరించు.నీ ఇష్ట ప్రకారం ఆయన చేయాలనుకోవటము శరణాగతి కాదు. ఆయనపై ఆధిపత్యమే అవుతుంది. ఏది ఉత్తమమో ఆయనకే తెలుసు. ఎప్పుడు ఏ రీతిగా జరిపించవలెనో ఆయనకు తెలుసు. అన్నీ పూర్తిగా ఆయనకు వదిలిపెట్టు. బరువు బాధ్యతలు ఆయనవే. నీవు తాపత్రయపడవలసింది ఏమీలేదు. నీ తాపత్రయాలన్నీ ఆయనవే. అదే శరణాగతి. అదే భక్తి.
అంతా నేను చేస్తున్నాను అనుకోవటమే పొరపాటు. చేయించేది అంతా ఈశ్వరుడే. అది గ్రహిస్తే బాధల నుండి విముక్తుడవవుతావు. అందరూ భగవంతునిచే సృష్టించబడినవారే. ఆయనచే కాపాడబడుతున్నవారే. నీకు కావలసినది ఆయనకు తెలుసు. చెప్పుకోవలసిన పని  లేదు. ఆయనే చూసుకుంటాడు.
‘చేసేది ఎవరు’ అని ప్రశ్నించుకో. నీవెవరో గుర్తుంచుకో. అపుడు కర్మ నిన్ను బంధించదు. దానంతటదే జరిగిపోతుంది. విధి నిర్ణయానుసారం నీవు చేయవలసినది తప్పనిసరిగా చేయవలసియే యుంటుంది. తప్పించుకోలేవు. ఆత్మానుభవం మనస్సు పరిపక్వతకు సంబంధించిన విషయం.
నీ మటుకు నీవు, ఆకారం ఉన్నదని భావిస్తుంటే, జగత్తూ, భగవంతుడూ కూడా ఆకారం ఉన్నట్లే అనిపిస్తుంది. అంటే భగవంతుని ఆకారం కూడా నీ మనస్సు చేతనే నిర్ణయించబడుతుంది(నీకు కావలసిన రూపంలో).  ఉన్నాడో లేడో  అనే భగవంతుని గూర్చి బెంగ ఎందుకు? నీవున్నావని నీకు తెలుసుకదా. కనుక నీపైనే నీ దృష్టి కేంద్రీకరించి, ఆత్మను తెలుసుకోవటానికి ప్రయత్నం చెయ్యి. ఆత్మ జ్ఞానం కలిగితే అన్నీ అవే అవగతమవుతాయి.
ముఖం ఎట్లా ఉన్నదో తెలుసుకోవటానికి అద్దంలో చూసుకుంటాము. అద్దంలో కనబడేది ప్రతిబింబమే కాని సొంత ముఖం కాదు కదా. అది కూడా అద్దము యొక్క నిబంధనలకు లోబడి అంటే ఎడమ కుడి గాను, కుడి ఎడమ గాను. అట్లానే నీ ఇంద్రియాలకూ మనస్సుకూ తెలిసేది ఏదీ వాస్తవం కాదు. ఎంత గొప్ప దృశ్యాలు కనబడినా, అదేదో నీ ఆత్మ దర్శనం అనుకున్నా లేక నాకే కదా గొప్ప అనుభవం వచ్చిందనుకున్నా అంతటితో నీ అభివృద్ధి  ఆఖరు. ఎవరికి  కనిపిస్తుందో ఇదంతా అని తర్కిoచుకుని , వీటినన్నింటిని తెలుసుకునేది ఏదో, ఆ తెలివిని పట్టుకోవటానికి చూడు. నీ మనస్సు పనిచెయ్యకుండా , ఏ ఆలోచనా లేకుండా, ఏది ఉందో,  అదే నువ్వు . దానినుంచి కదలకు .
ఈ ‘నేను’ అనునది లేని నిద్రయందు కూడా పరిపూర్ణ ఆత్మ ఉంటుంది. మానవుడు తన అహాన్ని నిర్మూలిo చు కోగలిగితే గాని జ్ఞానోదయం కాదు. నేను ఈ పని చేస్తున్నాను అనే భావాన్ని పోగొట్టుకోవాలి.
కొండపైకి ఎక్కి చూస్తే, అన్ని వస్తువులు ఒకటిగానే కన్పిస్తాయి. అలాగే, పైకి వెళ్ళిన కొద్దీ అన్నిటిని ఒకటిగానే చూడటం జరుగుతుంది.
జ్ఞాన మార్గమున ఆలోచించిన పరిశుద్ధమగు ‘అంతరాత్మయే’ సద్గురువు. జ్ఞాన మనగా తనను తాను తెలిసికొని తాదాత్మ్యము చెందటం.
నీవేమి చేసిననూ, చేసితివని అనుకొనిననూ, అదంతా నిజముగా ఈశ్వరుని కార్యమే. అనగా ఆయన చేసినదే. ‘నాది’ అనునది ఏదియు నిజముగా లేదు. సేవ యొక్క ఉద్దేశసారము పరమ భక్తియే. నిజమైన భక్తుడు ప్రతి వస్తువు నందును ఈశ్వర స్వరూపమునే చూస్తాడు. ఈశ్వరునే నామ రూపములతో ధ్యానించటం మొదలుపెట్టినా చివరకు నామరూపాతీత స్థితికి, ఆ ధ్యానమే వానిని తీసుకొని వెళ్తుంది. భక్తి పూర్ణమైనప్పుడు అదే జ్ఞానమని తెలుస్తుంది. ఈ భక్తి కామ్యార్ధమై ప్రారంభించిననూ , ఆ కోర్కెలు సిద్ధిoచగానే భక్తి అంతరించదు. అది మరింత దృఢమై, సంపూర్ణ విశ్వాస మేర్పడి, అభివృద్దియై, పరమోత్తమమగు జ్ఞానమై, తన్మయత్వమును  సిద్దిoపజేయును. జ్ఞానమార్గమున అహంకారము నశించి, సహజ సిద్ద మగు పరమాత్మ అనుభవ సిద్ధి కలుగుతుంది. భక్తి, జ్ఞానం ఈ రెండూ అవాజ్ఞ్మానస గోచరమైన పరమశాంతిని చేకూరుస్తాయి.
హృదయము నుండి మనస్సును బయటకు పోనీయకుండా నిలుపుకొనుటయే ‘అంతర్ముఖము’. ఇట్లు మనస్సు హృదయమున నిలిచినట్లయిన, తలoపులన్నింటికి మూలమైన ‘నేను’ అను అహంభావం పోయి, ఎల్లప్పుడూ ఉండు ‘ఆత్మ’ తానై ప్రకాశిస్తుంది.   ఏది చేసిననూ నేను అను అహంకారము లేక చేయవలెను . అప్పుడు సర్వము శివ స్వరూపముగా తోచును.
జగత్తు అనునది తలంపుల కన్నా వేరుగా లేదు. నిద్రలో తలంపులు లేవు, జగత్తును లేదు. స్వప్నావస్థలోను, జాగ్రదావస్థ లోను, తలంపులు కలవు, జగత్తు కలదు.

ఆత్మ స్వరూపము నుండి మనస్సు వెలువడుట  వలన జగత్తు కనిపిస్తుంది. సర్వవిషయములకు, సర్వ వ్యాపక, వ్యాపారములకు కారణమగుచున్న మనస్సు అణగినప్పుడు దృశ్యముగానున్న జగత్తు అంతర్దానమవుతుంది. అప్పుడు స్వరూప ద/ ర్సన ప్రాప్తి కలుగుతుంది. స్వరూపము కానవచ్చినపుడు జగత్తు కానరాదు. జగత్తుకాన వచ్చినపుడు స్వరూపము కానరాదు .

No comments:

Post a Comment