Tuesday, 9 August 2016

నిత్యసత్యం - 04


నీవొక వ్యక్తివనీ, నీకు వెలుపల విశ్వం ఉన్నదనీ, విశ్వానికి అతీతంగా భగవంతుడున్నాడనే భిన్నత్వ భావన పోవాలి. గీతలో ‘నేనే ఆదిని, మధ్యాన్ని, అంతాన్ని అయి ఉన్నాను. నేను సర్వభూత హృదయాలలోనూ ఉన్నాను.’ అన్నాడు. అతడే అందరికి మూలం, ఆధారం, మరియు అంతము. అందరూ అతని నుండే బయల్వెడి, అతనితోనే ఉండి, అతనితోనే లయిస్తారు. కాబట్టి అతను వేరుగా లేడు . భగవంతుని కార్యకలాపాలలో ఒక దశ వల్ల ఈ విశ్వం వ్యక్తమవుతున్నది. అంతా బ్రహ్మమే. అది అఖండంగానే ఉంటుంది. అతనెప్పుడూ సాక్షాత్కరించే ఉన్నాడు.  
ఆత్మ, బ్రహ్మమే అను శాశ్వత సత్యాన్ని తెలుసుకోవాలి. బ్రహ్మమును చూసేందుకు, తెలుసుకునేందుకు వీలులేదు. అది ద్రష్ట, దర్శనము, దృశ్యము అను త్రిపుటికి అతీతమైనది. సద్వస్తువు ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ‘ బ్రహ్మణ్హోహి  ప్రతిష్టాహ’ అని గీత అంటుంది. ఆ ‘ అహం’ ను తెలుసుకుంటే మొత్తం తెలిసిపోతుంది.
పరమాత్మ తెలియబడకుoడటంగాని, అప్రాప్తంగా ఉండటం గాని ఎప్పుడూ లేదు. ఎందుకంటే, అతను ఏకమై ఉన్నాడు. ఆత్మతో సమానమై ఉన్నాడు. ఆయన అనుగ్రహం, ఆయన దివ్యసాన్నిధ్యంతో సమానం. దీనినే జ్ఞాన ప్రాప్తి అంటారు. నీవు సూర్య కాంతిలో ఉన్నా, సూర్యుణి/న్ని  తెలుసుకోగోరితే నీకళ్ళను సూర్యుని దిశగా మరలించి చూడాలి. అలాగే దైవానుగ్రహం ఇప్పటికిప్పుడు ఉన్నప్పటికీ, స్వప్రయత్నం ద్వారానే తెలుసుకోవాలి. అలాగే, ఒక అజ్ఞానికి నిత్యం స్వయంప్రకాశమానమై ఉన్న ఆత్మ తెలియకుంటే ఆ దోషం ఆత్మదా లేక ఆ అజ్ఞానిదా . అంటే సూర్యుణ్ణి గుడ్లగూబ చూడజాలకుంటే అది సూర్యుడి తప్పా లేక ఆ పక్షియొక్క దృష్టి లోపమా?
పరమేశ్వరుడు శాశ్వత అనుగ్రహమే. కనుక అనుగ్రహాన్ని ప్రసాదిoచటమనే ప్రత్యేక క్రియ ఉండదు. అది సర్వే సర్వత్రా వ్యాపించి ఉంది. ఈశ్వరానుగ్రహం కావాలనుకునే నీ కోరిక సైతం, నీలో ఇప్పటికే పనిచేస్తున్న ఈశ్వరానుగ్రహం వలన కలిగినదే.
విధాత జీవుల ప్రారబ్ధకర్మను, అంటే జన్మంతరాలలో అవశేషించి యుండి, ఈ జీవితకాలంలో అనుభవిoచ వలసియున్న కర్మను అనుసరించి వారి విధిని నిర్ధారిస్తాడు. నీవు ఎంత ప్రయత్నించినా , విధి నిర్ణయానుసారం మాత్రమే జరుగుతుంది. శరీరం చేయవలసిన కార్యకలాపాలన్నీ ఈ లోకంలోకి వచ్చేటప్పుడే నిర్ణయించబడి ఉన్నాయి. వాటిని ఆమోదించటం, తిరస్కరించటం, నీ అధీనంలో లేవు. నీకు ఉన్న స్వేచ్ఛ అంతా మనస్సును అంతర్ముఖంగా చేసుకునే స్థితిలో ఉండటమే. నీవెంత తప్పించుకోవాలన్నా జరుగనున్నది జరిగే తీరుతుంది.
సృష్టికర్త ఒకరు. జీవులంతా సృష్టింపబడిన వారే. ఈ సృష్టించబడిన వారికే స్వేచ్ఛ ఉంటే, సృష్టికర్త సర్వశ క్తిమంతుడు, సర్వజ్ఞుడు కాలేడు.  అంటే ఏమి జరుగబోతున్నదో ఆయనకు తెలియదు. జరుగవలసినవన్నీ ఎవరికి వారు వారి ఇష్టానుసారం మార్చుకోవచ్చు. అoటే తన అదుపులో ఏదీ లేదన్నమాట.

అలాగాక, ఆయన సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడూ అయితే జరగబోయేదంతా తనకు ముందుగానే తెలుస్తుంది. అంతా తన అదుపులోనే ఉంటుంది. అంటే మనకు నిర్ణయాలు చేసే శక్తి ఉండదు. విధిని జయించాలంటే ఆత్మను గుర్తించాలి. లేదా శరణాగతి పొందాలి. నిజమైన శరణాగతి భగవంతుని ప్రేమకోసం, ప్రేమించటమే గాని వేరే ఎందుకూ కాదు. మోక్షం కూడా అంతే. 

No comments:

Post a Comment