Tuesday, 9 August 2016

నిత్యసత్యం - 13

ఆత్మ సాక్షాత్కారము
దీని గురించి మాట్లాడటం భ్రమ. ఎందుకంటే ప్రజలు అనాత్మను ఆత్మగాను, అసత్యాన్ని సత్యం గాను భ్రమిస్తారు. దానిని పోగొట్టుకోవటానికి ఆత్మ సాక్షాత్కారమైoదనుకోవటం ఇంకా భ్రమ. ఎందుకంటే ఆత్మ ఎప్పుడూ ఉండేదే. దానికి సాక్షాత్కారం ఉండదు. ఉండేదంతా ఆత్మ తప్ప వేరేలేనప్పుడు, ఎవరికి సాక్షాత్కారం కలుగుతుంది. ఎలా కలుగుతుంది.
మోక్షం
అందరూ మోక్షం ఎక్కడో ఉందనుకుంటారు. దాన్ని పొందాలి అనుకుంటారు. కాని అది తప్పు. నీలో ఉన్న ఆత్మను తెలుసుకోవటమే మోక్షం. కేంద్రీకరించు .అది నీకు లభిస్తుంది.
మంత్రం
నిశ్చలంగా అoటే ఆలోచనలు లేకుండా ఉండి , ‘నేనే దైవమని’ అనుకో. అదే మంత్రం.
ముక్తి
ముక్తి మన సహజ లక్షణం. మనకి అది మారుపేరు. ముక్తి కావాలని కోరుకోవటం హాస్యాస్పదం. నీడలో ఉన్న మనిషి ఎండలోకి వెళ్లి, మళ్ళీ విశ్వ ప్రయత్నం చేసి నీడలోకి రాగానే, ‘అమ్మయ్య నీడని చేరుకున్నాను’ అన్నట్లే. మనమంతా ఇదే చేస్తున్నాం. సత్యానికి, మనకి భేదముందనీ, ఊహించుకుని, భేదభావం కల్పించుకుంటాం. తర్వాత ఎంతో సాధన చేసి భేదభావాన్ని వదిలించుకొని సత్యంతో ఏకమవుతాం. ఈ భేదభావం కల్పించుకోవటం ఎందుకూ, దానిని నాశనం చేసుకోవటం ఎందుకూ.

ఉత్తమ భక్తుడు
స్వరూపమైన భగవంతుని యందు ఎవడు తనను తాను అర్పణము చేసుకుంటాడో అతడే భక్త శ్రేష్ఠుడు. ఆత్మ చింతనము తప్ప, ఇతర ఆలోచనలకు కొంచెమైనను తావీయక, ఆత్మనిష్టాపరుడై ఉండుటయే తనను ఈశ్వరునికి అర్పించుకొనుట .
ఈశ్వరునిపై ఎంత భారం మోపినను దానినంతను అతను వహించు చున్నాడు. సకల కార్యములను ఒక పరమేశ్వర శక్తి నడుపుచుoడుట వలన, మనము దానికి లోబడి  ఉండుట శ్రేయస్కరము.

ముక్తి /గురువు
ఈశ్వరుడు గురువు. గురువు ముక్తి చేరు మార్గమును చూపువాడే గాని, తానే జీవుని ముక్తికి చేర్చువాడు కాడు. యదార్ధమున ఈశ్వరుడు, గురువు వేరు కాదు. గురుకటాక్ష దృష్టిని పడినవాడు అతనిచే రక్షింపబడునే గాని
ఎన్నటికీ విడువబడడు .
అయినను, ఒక్కొక్కరును తమ ప్రయత్నము వలననే, గురుడు చూపిన దారి తొలగక అనుసరించి ముక్తిని పొందవాలెను. తననుతానే తన జ్ఞాన చక్షువులతో చూచుకొనవలెనే గాని ఇతరుల ద్వారా కాదు.

వైరాగ్యం
ఉత్పత్తి అయ్యే సమస్త తలంపులను, ఉత్పతి స్థానంలోనే నశింపచేయడాన్ని  వైరాగ్యం అంటారు. ఒక్కొక్కరు వైరాగ్యాన్ని పూని, తనలో లోతుగా మునిగిన ‘ఆత్మ’ అనే ముత్యాన్ని పొందగలరు.




సహజ సమాధి

ఇది ప్రత్యేకమైనది. జ్ఞానరీత్యా ఈ సహజ సిద్ధియే నిర్వికల్ప స్థితి. ఇందులో నీకు సమాధానము కలదు. నీవు దినచర్య చేయుచుoడినను, శాంతియు నిలకడయు, యుండును. నీవు కేవలము అంతరాత్మ ప్రేరితుడివై చరిoచు చున్నావని గుర్తింతువు . అందువలననే, నీవేది చేయుచున్నను, తలచుచున్నను, ఆ చేతలు, తలంపులు నీకు చెందవు. నీకు చింతలుండవు, ఆతురత ఉండదు. బాధ్యత ఉండదు. ఇచ్చట సంభావాసంభావములు, సాధ్యాసాధ్యములు మొదలగు ద్వందముల మధ్య ఊగిసలాట ఉండదు. ఏ విధమైన వికల్పమును లేదు. దానికి సత్య వస్తువును గురించి సంశయమే లేదు. నిశ్చయమే. సత్య వస్తువు ప్రత్యక్షముగా ఉండును. ఎందువలననగా, ఆహoకారాన్విత జీవునికి చెoదిన దేదియు లేదు. ప్రతి పని కూడా వేరై యున్న ఒక వస్తువు చేత జరుపబడుచుండును. అట్టి గొప్ప వస్తువుతో నీవేకమై యుందువు.

No comments:

Post a Comment